ఎస్ఆర్‌హెచ్‌ త‌మ రికార్డు బ‌ద్ద‌లు కొట్టడంపై ఆర్‌సీబీ స్పంద‌న ఇదీ!

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు (277) న‌మోదు చేసిన ఎస్ఆర్‌హెచ్‌
  • ఇంత‌కుముందు ఆర్‌సీబీ పేరిట రికార్డు
  • 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో పూణే వారియ‌ర్స్‌పై 263 ప‌రుగులు చేసిన బెంగ‌ళూరు
  • 11 ఏళ్ల త‌ర్వాత అత్య‌ధిక ప‌రుగుల రికార్డును బ్రేక్ చేసిన ఆరెంజ్ ఆర్మీ  
ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా బుధ‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌), ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) మధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌యిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌ధానంగా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు ఒక‌టి. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ మొద‌ట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 277 ప‌రుగులు చేసింది. ఇదే ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ (ఆర్‌సీబీ) పేరిట ఉండేది. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో పూణే వారియ‌ర్స్‌పై ఆర్‌సీబీ 263 ప‌రుగులు చేసింది. 11 ఏళ్ల త‌ర్వాత ఈ అత్య‌ధిక ప‌రుగుల రికార్డును ఆరెంజ్ ఆర్మీ బ్రేక్ చేసింది. 

దీనిపై ఆర్‌సీబీ త‌న అధికారిక ఎక్స్ (గ‌తంలో ట్విట‌ర్‌) ఖాతా ద్వారా స్పందించింది. ఎస్ఆర్‌హెచ్ సాధించిన అత్య‌ధిక ప‌రుగుల‌ రికార్డును ప్ర‌శంసించింది. హేన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌నంటూ మెచ్చుకుంది. 'క్లాస్ ఇన్నింగ్స్‌తో మా త‌ల తిరిగింది' అని హెడ్‌, క్లాసెన్ ఇన్నింగ్స్‌ల‌ను ప్ర‌స్తావించింది. అలాగే కొత్త బెంచ్‌-మార్క్‌ను క్రియేట్ చేసినందుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఇక రికార్డులు ఉండేది బ్రేక్ చేయ‌డానికే.. వెల్‌డ‌న్ అంటూ ట్వీట్ చేసింది. 

ఇదిలాఉంటే.. నిన్న‌టి మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల బ్యాట‌ర్లు పూన‌కాలు వ‌చ్చిన‌ట్లు బౌండ‌రీల‌తో విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తం సిక్స‌ర్లు, ఫోర్ల సంఖ్య 69గా న‌మోదయిందంటే బౌల‌ర్ల‌ను బ్యాట‌ర్లు ఎలా ఊచ‌కోత కోశారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇందులో ఏకంగా 38 సిక్స్‌లు ఉన్నాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కూడా ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో 20 సిక్స‌ర్లు ముంబై బ్యాట‌ర్ల నుంచి వ‌చ్చిన‌వే. ఇక 278 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఎంఐ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 246 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 31 ప‌రుగుల తేడాతో ముంబై ఓడిపోయింది.


More Telugu News