మమత, కంగనపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఈసీ నోటీసులు

  • బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనతేకు ఈసీ విడివిడిగా నోటీసులు
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా తేలిందని వ్యాఖ్య
  • చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని తాఖీదు
  • మార్చి 29లోపు స్పందించాలంటూ డెడ్‌లైన్
అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ శ్రీనతేకు ఈసీ తాజాగా నోటీసులు జారీ చేసింది. వారి వ్యాఖ్యలు అమర్యాదకరమైనవని ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు తెలిపింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. నోటీసులపై మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు స్పందించాలని ఆదేశించింది. నోటీసులకు స్పందించని పక్షంలో వారు చెప్పేందుకు ఏమీ లేదని భావించి చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఇరు నేతలకు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అమర్యాదకర వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, అవమానకరమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారమయ్యాయని చెప్పుకొచ్చింది. మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని అవమానిస్తూ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.

మరోవైపు, బీజేపీ తరపున బరిలోకి దిగిన సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనతే చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆమె సోషల్ మీడియా పేజీలో కంగన ఫొటోతో పాటు క్యాప్షన్‌గా ‘మార్కెట్లో ప్రస్తుతం రేటు ఎంత’ అన్న క్యాప్షన్ కనిపించడం తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. 

అయితే, దిలీప్, శ్రీనతే ఇద్దరూ తమ వివరణ ఇచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మమతపై రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, తనకు ఆమెతో ఎటువంటి వ్యక్తిగత వైరం, ద్వేషం లేవని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. మరోవైపు, తన పేజీకి అనేక మందికి యాక్సెస్ ఉన్నందున వారిలో ఎవరో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని శ్రీనతే వివరణ ఇచ్చారు.


More Telugu News