మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

  • మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శ
  • కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన విషయాన్ని జూపల్లి మరిచినట్లున్నారని ఎద్దేవా
  • జూపల్లి పాలమూరుపై గుత్తాధిపత్యం చెలాయించారని ఆగ్రహం
మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడతాం... వేటాడతామని హెచ్చరించారు. 

ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ, మంత్రులపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. జూపల్లి కృష్ణారావు గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడనే గౌరవం ఉండేదని... కేసీఆర్‌, హరీశ్ రావులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన విషయాన్ని జూపల్లి మరిచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.

జూపల్లి అయిదేళ్లు మంత్రిగా పాలమూరుపై గుత్తాధిపత్యం చెలాయించారని... ఇప్పుడు తమపై విమర్శలు చేయడం పట్ల ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కేసీఆర్ కేబినెట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేతను ఎంతగా పొగిడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 

కేసీఆర్ పాలమూరు కరవును శాశ్వతంగా దూరం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై చేతులెత్తేసిందని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుల కింద కేసీఆర్ హయాంలో ఆరు లక్షలకు పైగా ఎకరాలకు నీళ్ళు వచ్చిన విషయం జూపల్లి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పక్కన పెట్టి అవినీతి పాలనను మొదలు పెట్టిందని ఆరోపించారు.


More Telugu News