జైల్లో నుంచి ప్రభుత్వం నడవదని హామీ ఇస్తున్నాను: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
- టైమ్స్ నౌ సమ్మిట్‌లో స్పష్టం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
- ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
- కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు
జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపడానికి వీల్లేదని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బుధవారం స్పష్టం చేశారు. ఆయన టైమ్స్ నౌ సమ్మిట్‌లో మాట్లాడుతూ... 'ప్రభుత్వం జైలు నుంచి నడవబోదని నేను ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారని, ఆయన జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పైవిధంగా స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ నెల 21న అరెస్ట్ చేశారు. ఆయనను 28వ తేదీ వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది.