ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి: చంద్రబాబు

  • ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
  • పలమనేరు సభలో వాడీవేడిగా ప్రసంగం
  • సీఎం జగన్ కూడా ఇవాళే ప్రచారం ఆరంభిస్తుండడం పట్ల చంద్రబాబు స్పందన
  • మా ప్రాంతానికి జగన్ రావడానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు
  • ప్రజలు గెలవాలంటే జగన్ దిగిపోవాలన్న టీడీపీ అధినేత 
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, సీఎం జగన్ కూడా ఇవాళ్టి నుంచే ప్రచారం చేస్తుండడంపై స్పందించారు. 

ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు... మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే... జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. 

తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని, గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ కాదా? అని మండిపడ్డారు. తాము గతంలో ఓసారి ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నామని, అప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, మైనారిటీల కోసం అనేక పథకాలు అమలు చేశామని వివరించారు. 

జగన్ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?

టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులను 90 శాతం పూర్తి చేశామని, కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటికీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో జగన్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని, ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు జగన్ కు లేదని ఉద్ఘాటించారు. ఇప్పుడు సిద్ధం అంటూ వస్తున్నాడని, జగన్ ను ఇంటి దారి పట్టించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సమర సన్నద్ధత చాటారు.

25 ప్రాజెక్టులు రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీది!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఒక్క రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అందులోనూ హంద్రీనీవా కోసమే రూ.4,200 కోట్లు వ్యయం చేశామని వివరించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో నీటి ప్రాజెక్టుల కోసం కేవలం రూ.2,165 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. 

మే 13 కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు!

రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోవాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకే వారంతా ఎన్నికలు జరిగే తేదీ మే 13 కోసం ఎదురుచూస్తున్నారని చంద్రబాబు వివరించారు. మే 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజని అభివర్ణించారు. అరాచకపాలన, దోపిడీ, డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం... వీటన్నింటి నుంచి విముక్తి కలిగించే రోజు... మే 13 అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.


More Telugu News