బస్సులో మహిళా ప్రయాణికురాలిపై దారుణంగా దాడిచేసిన కండక్టర్.. వీడియో ఇదిగో!

  • బెంగళూరు మెట్రో బస్సులో ఘటన
  • టికెట్ విషయంలో కండక్టర్, మహిళ మధ్య వాగ్వివాదం
  • బాధిత మహిళ ఫిర్యాదుతో కండక్టర్ అరెస్ట్
  • కండక్టర్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన బీఎంటీసీ
టికెట్ విషయంలో ప్రయాణికురాలితో వాగ్వివాదం తర్వాత సహనం నశించి ఆమెపై దాడికి తెగబడిన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) కండక్టర్ హోనప్ప నాగప్ప అగసర్‌(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విధుల నుంచి తొలగించిన బీఎంటీసీ ఘటనపై విచారణకు ఆదేశించింది.

నిన్న ఉదయం 10 గంటల సమయంలో టికెట్ విషయంలో మహిళా ప్రయాణికురాలు తంజుల (24)తో కండక్టర్ హోనప్పకు వాగ్వివాదం జరిగింది. బస్ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్న వీడియోను బీఎంటీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గొడవ కాస్తా ముదరడంతో ప్రయాణికురాలు తొలుత కండక్టర్ చెంపపై కొట్టింది. దీంతో రెచ్చిపోయిన కండక్టర్ ఆమెపైకి ఒక్కసారిగా దూకి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆమె కిందపడిపోయింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా కండక్టర్ ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు.

ఈ ఘటన తర్వాత బాధిత ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. టికెట్ ఇవ్వాలని పలుమార్లు కోరినా అతడు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో కండక్టర్ తప్పిదం కనిపిస్తోందని బీఎంటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివాదం ఎలా ప్రారంభమైనప్పటికీ అతడు సహనం కోల్పోయి దాడిచేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 

ఈ ఘటన తర్వాత అధికారులు హోనప్పను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో వేతంలో సగం కోల్పోనున్నాడు. అలాగే, విచారణ అనంతరం అతడిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.


More Telugu News