కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత తొలిసారి నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

  • మొహల్లా క్లినిక్‌లలో ఉచిత మందులు, పరీక్షలపై జైలు నుంచే కేజ్రీవాల్ ఆదేశాలు
  • అంతకుముందు నీటి సరఫరాపై తొలి ఆదేశం
  • నేటి అసెంబ్లీ సమావేశంలో కేజ్రీవాల్ ఆదేశాలపై చర్చ
  • ప్రజలు ఇబ్బంది పడకూడదనే కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేస్తున్నారన్న మంత్రి భరద్వాజ్
ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

తాను అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కేజ్రీవాల్ భావిస్తున్నారని, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలు మందుల కోసం, పరీక్షల కోసం ఇబ్బంది పడకూడదనే ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉచిత మందులు, పరీక్షలపై నేటి అసెంబ్లీలో చర్చిస్తారు. అలాగే, ప్రతిపక్షాల ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇస్తారు. మొహల్లా క్లినిక్‌ల పరిస్థితి, సీఎం ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది అన్న విషయాలను వివరిస్తారు. కాగా, కేజ్రీవాల్ అంతకుముందు నీటి సరఫరాకు సంబంధించి కస్టడీ నుంచే తొలి ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది.


More Telugu News