బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: పెర్త్ టెస్టుతో ప్రారంభం.. అడిలైడ్‌లో డే నైట్ టెస్టు

  • న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా 
  • పెర్త్ వేదిక‌గా మొద‌టి టెస్టు (న‌వంబ‌ర్ 22-26)
  • అడిలైడ్ ఓవ‌ల్‌ మైదానంలో రెండో టెస్టు (డే నైట్, డిసెంబ‌ర్ 6-10) 
  • మూడో టెస్టుకు గ‌బ్బా స్టేడియం ఆతిథ్యం (డిసెంబ‌ర్ 14-18)
  • మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు (డిసెంబ‌ర్ 26-30) 
  • సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఐదో టెస్టు మ్యాచ్ (2025 జ‌న‌వ‌రి 3-7)
భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగే ఐదు టెస్టు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేర‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది. కాగా, 1991-92 నుంచి ఆసీస్‌, భార‌త్ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గానే ఈ సిరీస్‌ను ప్రారంభించ‌డం అన‌వాయతీగా వ‌స్తోంది. ఈ మొద‌టి టెస్టు న‌వంబ‌ర్ 22-26 వ‌ర‌కు ఉంటుంది. 

ఇక ఈ సిరీస్‌లో రెండో టెస్టు అడిలైడ్ ఓవ‌ల్‌ మైదానంలో జ‌ర‌గ‌నుంది. ఇది డే నైట్ (పింక్‌బాల్‌ టెస్టు) టెస్టు మ్యాచ్‌. ఈ టెస్టు డిసెంబ‌ర్ 6 నుంచి 10వ‌ తేదీల్లో జ‌రుగుతుంది. అలాగే మూడో టెస్టుకు గ‌బ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్ డిసెంబ‌ర్ 14-18 మ‌ధ్య జ‌రగ‌నుంది. ఇక‌ నాలుగో మ్యాచ్‌ (బాక్సింగ్ డే టెస్టు) ఆసీస్‌లోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మెల్‌బోర్న్‌లో డిసెంబ‌ర్ 26-30 తారీఖుల్లో జ‌రుగుతుంది. ఇక ఆఖ‌రిదైన ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 2025 జ‌న‌వ‌రి 3-7 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. 

ఇక రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్ట్ సిరీస్‌లలో భార‌త్‌దే ఆధిప‌త్యం కొనసాగింది. ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఛాంపియన్‌గా ఉన్న టీమిండియా ప్రతిసారీ గెలుస్తూ మరింత ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఇలా 2018-19, 2020-21ల‌లో వ‌రుస‌గా ఈ ట్రోఫీ సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవ‌సం చేసుకోవ‌డం జ‌రిగింది. అటు స్వ‌దేశంలో జ‌రిగిన సిరీస్‌ల‌లోనూ భార‌త్‌ను కంగారు జ‌ట్టు 2014-15 త‌ర్వాత ఒక్క‌సారిగా ఓడించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్, మల్టీఫార్మాట్ మహిళల యాషెస్‌పై ఈ వేస‌విలో క్రికెట్ ప్రపంచం అధికంగా దృష్టిసారించ‌డంతో పాటు ఆబగా ఎదురుచూస్తోంది కూడా. 1991-92 తర్వాత మొదటిసారిగా ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు యాషెస్ కూడా జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ వీక్షకుల సంఖ్యను పెంచుతుంది. అలాగే వారి హాజరు పెర‌గ‌డంతో దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల‌లో అద్భుతమైన వాతావరణం ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము" అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు.


More Telugu News