కుప్పంలో చంద్ర‌బాబు ఇంటింటి ప్ర‌చారం.. అర్చ‌కుడిపై దాడి ఘ‌ట‌న‌ను ఖండించిన టీడీపీ అధినేత‌

  • కుప్పంలో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్న చంద్ర‌బాబు
  • ఈసారి కుప్పంలో చంద్ర‌బాబును ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామన్న స్థానికులు
  • అర్చ‌కుల‌పై దాడి చేయ‌డం అనేది హేయ‌మైన చ‌ర్య‌గా పేర్కొన్న చంద్ర‌బాబు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. రెండో రోజు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం జ‌రిగింది. త‌మ స‌మ‌స్య‌ల‌ను పేర్కొంటూ వారు ఇచ్చిన విన‌తుల‌ను స్వీక‌రించారు. 

చంద్ర‌బాబుకు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికిన స్థానికులు, ఈసారి కుప్పంలో ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. రెండు నెల‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత చేప‌ట్ట‌బోయే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు స్థానికుల‌కు వివ‌రించ‌డం జ‌రిగింది. 

అర్చ‌కుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్ర‌బాబు
కాకినాడ‌లోని శివాల‌యంలో అర్చ‌కుడిపై వైసీపీ నేత దాడి ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబు స్పందించారు. "అర్చ‌కుడు అంటే దేవుడికీ, భ‌క్తుడికీ మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా భావించి కాళ్ల‌కు మొక్కే సంప్ర‌దాయం మ‌న‌ది. అటువంటి అర్చ‌కుల‌ను భ‌క్తుల ముందు కాలితో త‌న్న‌డం, దాడి చేయ‌డం అనేది హేయ‌మైన చ‌ర్య‌. వైసీపీ నేత‌ల అధికార మ‌దానికి, మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిన్న‌చూపున‌కు ఇది నిద‌ర్శ‌నం. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక కొన్నాళ్లు వ‌రుస‌గా ఆల‌యాల్లోని విగ్రహాల‌పై దాడులు జ‌రిగాయి. ఇప్పుడు ఏకంగా ఆల‌యంలో పూజారుల‌పైనే దాడి చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన నిందితుడిపై ప్ర‌భుత్వం వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి" అని చంద్ర‌బాబు అన్నారు.


More Telugu News