ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు.. డెత్ ఓవ‌ర్ల మొన‌గాడు!

  • డెత్ ఓవ‌ర్ల (17-20) లో అత్య‌ధిక స్ట్రైక్ రేట్ (280) క‌లిగిన బ్యాట‌ర్‌గా దినేష్ కార్తీక్
  • అలాగే డెత్ ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ర‌న్స్ (372) చేసిన రెండో బ్యాట‌ర్.. 383 ప‌రుగుల‌తో షిమ్రాన్ హెట్మేయ‌ర్ మొద‌టి స్థానం
  • ఈ జాబితాలోని టాప్‌-5 ఆగ‌ట‌గాళ్ల‌లో మిగ‌తా ముగ్గురు రింకూ సింగ్ (351), టీమ్ డేవిడ్ (290), డేవిడ్ మిల్ల‌ర్ (285)    
  • 2022 నుంచి ఐపీఎల్‌లో న‌మోదైన గ‌ణాంకాల ఆధారంగా జాబితా విడుద‌ల‌
రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఆట‌గాడు దినేష్ కార్తీక్ తాజాగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. డెత్ ఓవ‌ర్ల (17-20) లో అత్య‌ధిక స్ట్రైక్ రేట్ క‌లిగిన బ్యాట‌ర్‌గా అవ‌త‌రించాడు. అలాగే డెత్ ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన రెండో బ్యాట‌ర్ కూడా దినేష్ కార్తీకే కావ‌డం గ‌మ‌నార్హం. 2022 నుంచి ఐపీఎల్‌లో న‌మోదైన గ‌ణాంకాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించ‌డం జ‌రిగింది.  

డెత్ ఓవ‌ర్ల‌లో అత‌ని స్ట్రైక్ రేట్ ఏకంగా 280 గా ఉండ‌డం విశేషం. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు డెత్ ఓవ‌ర్ల‌లో 372 ప‌రుగులు చేశాడు. ఇక అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో దినేష్ కార్తీక్ కంటే ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ షిమ్రాన్ హెట్మేయ‌ర్ ఉన్నారు. అత‌డు 383 ప‌రుగులు (స్ట్రైక్ రేట్‌- 197.42)  చేశాడు. ఇక ఈ జాబితాలో ఉన్న టాప్‌-5 ఆగ‌ట‌గాళ్ల‌లో మిగ‌తా ముగ్గురు వ‌చ్చేసి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చెందిన రింకూ సింగ్ (351 ప‌రుగులు, 195 స్ట్రైక్ రేట్‌), ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్‌ టీమ్ డేవిడ్ (290 ప‌రుగులు, 207.14స్ట్రైక్ రేట్‌), గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ (285 ప‌రుగులు, 161.01 స్ట్రైక్ రేట్‌) ఉన్నారు. 

ఇక సోమ‌వారం పంజాబ్ కింగ్స్‌తో చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్‌కి తోడు చివ‌ర‌లో దినేష్ కార్తీక్‌, మ‌హిపాల్ లోమ్రోర్ మెరుపులు మెరిపించ‌డంతో బెంగ‌ళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో దినేష్ కార్తీక్ కేవ‌లం 10 బంతుల్లోనే 28 ర‌న్స్ చేయ‌డం విశేషం. దాంతో ఆర్‌సీబీ ఆరు వికెట్లు కోల్పోయి 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అందుకుంది. అంత‌కుముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ 37 బంతుల్లో 45 ప‌రుగులు (ఐదు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌) చేశాడు. శిఖ‌ర్‌తో పాటు జితేష్ శ‌ర్మ (27), శామ్ క‌ర్ర‌న్ (23) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. అలాగే య‌శ్ ద‌యాల్‌, అల్జారి జోసెఫ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 177 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ వ‌రుస విరామాల్లో వికెట్లు పారేసుకుంది. కానీ, ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రోవైపు విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ప‌రుగులు రావ‌డం ఆగ‌లేదు. ఎప్ప‌టిలానే చేజింగ్ లో త‌న‌కు మించిన‌వారు లేర‌ని నిన్న‌టి ఇన్నింగ్స్‌తో మ‌రోసారి విరాట్ నిరూపించాడు. 49 బంతులు ఎదుర్కొన్న అత‌డు 77 ప‌రుగులు చేశాడు. ఇందులో 11 బౌండ‌రీలు, 2 సిక్సులు ఉన్నాయి. అలాగే చివ‌ర‌లో దినేష్ కార్తీ (10 బంతుల్లో 28 ప‌రుగులు), మ‌హిపాల్ లోమ్రోర్ (8 బంతుల్లో 17 ప‌రుగులు) విజృంభించ‌డంతో ఆర్‌సీబీ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే 177 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, క‌గిసో ర‌బాడ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా, 77 ప‌రుగుల‌తో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.


More Telugu News