మూడు పార్టీల అజెండా ఒక్కటే: చంద్రబాబు

  • కుప్పంలో టీడీపీ సభ
  • సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
  • ఏపీలో అరాచక పాలన పోవాలన్నదే కూటమి లక్ష్యమని వెల్లడి
  • రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని ఉద్ఘాటన 
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. 

ఏపీలో అరాచకపాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు. 

ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు.


More Telugu News