తెలంగాణలో పంజా విసురుతున్న రొమ్ము కేన్సర్

  • దేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే బ్రెస్ట్ కేన్సర్ ప్రభావం ఎక్కువ
  • హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో పంజా విసురుతున్న రొమ్ము కేన్సర్
  • జీవనశైలి, ఊబకాయం, లేటు వయసు పెళ్లిళ్లు కూడా కారణమేనన్న ఐసీఎంఆర్ అధ్యయనం
ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రొమ్ము కేన్సర్. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ కేన్సర్ తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతోపాటు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. దేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్య నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.

ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో రొమ్ము కేన్సర్ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత మహిళలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల మహిళలతో ఎక్కువగా దీని బారినపడుతున్నారు. ప్రస్తుత జీవనశైలి కూడా ఇందుకు ఒక కారణం. కంప్యూటర్ జాబ్స్ వంటి వాటితో శరీరానికి కదలికలు లేకపోవడం, ఊబకాయం, లేటు వయసు పెళ్లిళ్లు, ఆలస్యంగా పిల్లల్ని కనడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం వంటివి పట్టణ ప్రాంతాల్లో బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమవుతున్నాయి. 

సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందకపోవడంతో కేన్సర్ ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. అలాగే, ఆరోగ్య అంశాల్లో అవగాహన అంతంత మాత్రంగా ఉండడం కూడా ప్రతికూలంగా మారుతోంది. దీనికి తోడు పరిశోధన ప్రాథమ్యాల తీరు కూడా ఒక కారణమని అధ్యయనం తెలిపింది. పేదల్లో కేన్సర్ సమస్యను గుర్తించినప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. కాబట్టి ఈ వ్యాధిపై పోరాడాలంటే తొలుత సమాజంలోని అసమానతలను రూపుమాపాల్సి ఉంటుందని అధ్యయనం వివరించింది.


More Telugu News