తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి

  • కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి
  • యడియూరప్ప సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న గాలి
  • మోదీని మళ్లీ పీఎం చేసేందుకు ఒక కార్యకర్తగా పని చేస్తానన్న గాలి
లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బీజేపీలోకి చేరారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని బీజేపీలో విలీనం చేశారు. మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప సమక్షంలో తన పార్టీని బీజేపీలో కలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు. 

యడియూరప్ప మాట్లాడుతూ... గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో చేరారని... ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గాలి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News