147 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్

  • బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత అరుదైన ఘటన
  • రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు
  • రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన జంటగా మెండిస్-ధనంజయ జంట మరో రికార్డు
  • తొలి టెస్టులో ఓటమి అంచున బంగ్లాదేశ్
శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లో సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు నమోదు చేశాడు. నిజానికి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదడంలో ఎలాంటి విశేషమూ లేదు. తొలి ఇన్నింగ్స్‌లో మెండిస్ (102), ధనంజయ డిసిల్వా (102) సెంచరీలు నమోదు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వీరిద్దరూ మళ్లీ శతకాలతో విరుచుకుపడ్డారు. డిసిల్వా 108 పరుగులు చేస్తే, మెండిస్ 164 పరుగులు చేసి అదరగొట్టాడు. 

ఈ క్రమంలో మెండిస్ అత్యంత అరుదైన రికార్డు అందుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చి రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు, ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన మూడో జోడీగానూ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్రెగ్ చాపెల్-ఇయాన్ చాపెల్, పాకిస్థాన్ ఆటగాళ్లు మిస్బావుల్ హక్-అజార్ అలీ గతంలో ఈ ఘనత సాధించారు. 

కాగా, 512 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్  ఓటమి అంచున నిలిచింది. నేడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఆతిథ్య జట్టు 51 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.


More Telugu News