12 ఏళ్లుగా చెత్త రికార్డును కొన‌సాగిస్తున్న ముంబై ఇండియ‌న్స్‌..!

  • 2013 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ప్ర‌తిసారి తొలి మ్యాచులో ముంబై ఓట‌మి
  • ఈసారి కెప్టెన్ మారినా మ‌ళ్లీ అదే సీన్ రీపిట్‌
  • ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓట‌మి చ‌విచూసిన హార్దిక్ పాండ్యా
  • ముంబై ఇండియ‌న్స్‌పై గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్టరీ
  • సార‌ధిగా గుజ‌రాత్‌కు మొద‌టి మ్యాచ్‌లోనే విజ‌యాన్ని అందించిన‌ శుభ్‌మాన్ గిల్
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లో ఐదుసార్లు ఛాంపియ‌న్ అయిన ముంబై ఇండియ‌న్స్‌ను ఓ చెత్త రికార్డు వెంటాడుతోంది. ఇంతకుముందు 11సార్లు ఈ ఫీట్‌ను రీపిట్ చేసిన ముంబై.. ఈసారి కూడా దాన్ని కొన‌సాగించింది. 2013 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ప్ర‌తిసారి తొలి మ్యాచులో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి పాల‌వుతుంది. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో ప‌రాజయంతో మ‌రోసారి అదే సీన్ రీపిట్ అయింది. దాంతో 12వ సారి ఈ ఫీట్‌ను రీపిట్ చేసింది. ఈసారి కెప్టెన్ మారినా ముంబై త‌ల‌రాత మాత్రం మార‌లేదు. అయితే, ప‌రాజ‌యంతో ప్రారంభించి టోర్నీలో రాణించ‌డం, విజేత‌గా నిల‌వ‌డం ముంబై కొత్తేమీ కాదు అని  ఫ్యాన్స్‌ స‌మ‌ర్థిస్తున్నారు. 

ఇదిలాఉంటే.. న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచులో ముంబై ఆరు ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. మొద‌ట టాస్ గెలిచి గుజ‌రాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు కొత్త సారధి హార్దిక్ పాండ్యా. దాంతో గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 168 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ (45), కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (31), తేవాటియా (22) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీస్తే, కొట్జీ 2, పియూష్ చావ్లా ఒక‌ వికెట్‌ ప‌డ‌గొట్టారు. అనంత‌రం 169 ప‌రుగుల లక్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ముంబై 162 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో మాజీ సార‌ధి రోహిత్ శ‌ర్మ (43), బ్రెవిస్ (46), తిలక్ వర్మ (25), నమన్ ధీర్ (20) రాణించారు. ఇషాన్ కిష‌న్ (0), హార్దిక్ పాండ్యా (11), టిమ్ డేవిడ్(11) నిరాశప‌రిచారు. చివ‌రి ఆరు ఓవ‌ర్ల‌లో 46 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ పెవిలియ‌న్ చేర‌డంతో ముంబై ప‌రాజ‌యం ఖాయ‌మైంది. దీంతో గుజ‌రాత్ ఆరు ప‌రుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ న‌మోదు చేసింది. 

దీంతో సార‌ధిగా యువ ఆట‌గాడు గిల్‌.. గుజ‌రాత్‌కు తొలి మ్యాచ్‌లోనే విజ‌యాన్ని అందించాడు. అటు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మొద‌టి మ్యాచ్‌లోనే ఓట‌మి చ‌విచూసిన‌ట్ల‌యింది. ఇక ముంబై 17 సీజ‌న్ల ఐపీఎల్ టోర్నీలో కేవ‌లం నాలుగు సార్లు మాత్ర‌మే తాను ఆడిన‌ తొలి మ్యాచ్‌లో గెలిచింది. 2009, 2010, 2011, 2012 సీజ‌న్ల‌లో ఇలా ముంబై విజ‌యంతో టోర్నీని ప్రారంభించింది. ఆ త‌ర్వాత 2013 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 12 సార్లు ముంబై ఇండియ‌న్స్‌కు ప్రారంభ మ్యాచుల‌లో ప‌రాజ‌యమే ఎదురైంది.      


More Telugu News