అస్వస్థతకు గురైన టీడీపీ నేత బండారు... ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

  • బండారుకు ఒక్కసారిగా పడిపోయిన షుగర్ లెవల్స్
  • పెరిగిన రక్తపోటు
  • వెంటనే విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం 
ఉత్తరాంధ్ర టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇవాళ బండారు సత్యనారాయణకు ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి. అదే సమయంలో రక్తపోటు పెరిగింది. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన విశాఖకు తరలించి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బండారు ఆసుపత్రిలో చేరారన్న వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు.

బండారు సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన మరో రెండ్రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయి. 

బండారు సత్యనారాయణ ఈసారి ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ఆశించి నిరాశకు లోనయ్యారు. పొత్తులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జనసేనకు వెళ్లడంతో పంచకర్ల రమేశ్ కు టికెట్ ఖరారైంది. ఈ పరిణామంతో బండారు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. 

ఆయన గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, పెందుర్తి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆయనకు అనకాపల్లి నుంచి చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి.


More Telugu News