బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్

  • వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్
  • ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే
  • వరప్రసాద్ కు బీజేపీలోకి స్వాగతం పలికిన కమలనాథులు
  • రానున్న ఎన్నికల్లో వరప్రసాద్ తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ పడే అవకాశం
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయల వలసలు ఊపందుకున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దలు వరప్రసాద్ కు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. 

ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. కొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది. టికెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఉన్నారు. గూడూరు వైసీపీ అభ్యర్థిగా ఎం.మురళీధర్ కు అవకాశం ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం ఆయనకు కొత్త కాదు. వరప్రసాద్ 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


More Telugu News