సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో ఐపీఎల్ రూల్స్ అతిక్రమించిన కోల్‌కతా ప్లేయర్‌.. భారీ ఫైన్ విధింపు

  • మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధింపు
  • హైదరాబాద్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో అనుచిత ప్రవర్తన
  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బౌలర్ హర్షిత్ రాణా
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి కోల్‌కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధించారు. సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో దరుసుగా ప్రవర్తించాడు. ‘బయటకు వెళ్లండి’ అనేలా అనుచిత సైగలు చేశాడు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 60 శాతం మేర కోత విధిస్తూ ఐపీఎల్ పాలకమండలి ప్రకటన విడుదల చేసింది.

‘‘ మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. అతడి మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించాం’’ అని ప్రకటించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా రెండు స్థాయి-1 నేరాలకు పాల్పడ్డాడని, సంబంధిత నేరాలలో ఒకదానికి మ్యాచ్ ఫీజులో 10 శాతం, మరొక దానికి 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నేరాలను రాణా ఒప్పుకున్నాడని, మ్యాచ్ రిఫరీ వద్ద అంగీకరించాడని తెలిపింది. లెవెల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని ప్రకటనలో ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది.


More Telugu News