ఇంకా విడుదల కానీ యూఎస్ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు.. విద్యార్థుల్లో టెన్షన్

  • ఆగస్టు నుంచి అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభం 
  • మార్చి నెలాఖరు వస్తున్నా విడుదల కాని ఇంటర్వ్యూ స్లాట్లు, విద్యార్థుల్లో టెన్షన్,
  • క్లాసులు ప్రారంభమయ్యే నాటికి అమెరికాకు చేరుకోలేమని ఆందోళన
  • పర్యాటక వీసా ఇంటర్వ్యూ స్లాట్ల విడుదలోనూ జాప్యం
పైచదువుల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు.. వీసా ఇంటర్వ్యూల స్లాట్లు ఇంకా విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫాల్ సీజన్‌ తరగతులు ఆగస్టు నుంచి ప్రారంభం కానుండటంతో తగిన సమయంలో వీసా రాదేమోనని బెంగ పడుతున్నారు. సాధారణంగా అమెరికా కాన్సులేట్లు మార్చి నెల మొదట్లోనే స్లాట్లను విడుదల చేస్తాయి. అంతేకాకుండా, మొదటి సారి తిరస్కరణకు గురైన వారికి ఆ తరువాత కూడా ఇంటర్వ్యూ స్లాట్లు కేటాయిస్తాయి. 

ఇందుకు విరుద్ధంగా ఈసారి ఇప్పటివరకూ స్లాట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందు వీటిని విడుదల చేయొచ్చన్న వార్త అనేక మందిని ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురైన వారికి మరో మూడు సార్ల వరకూ ఇంటర్వ్యూలకు అవకాశం ఇచ్చే వారు. ఇకపై ఈ ఛాన్సులను రెండు సార్లకే పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, జూన్, జులై నెలల్లో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో పర్యాటక వీసా ఇంటర్వ్యూ స్లాట్లనూ పరిమితంగా విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి వీసా విషయంలో ఉన్నంత స్పష్టత కూడా పర్యాటక వీసాల్లో ఉండట్లేదు. ఇంటర్వ్యూ కోసం కొందరు ఏడాది వరకూ వేచి చూడాల్సి వస్తోంది. దీంతో, స్లాట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


More Telugu News