కేరళ ప్రభుత్వం అసాధారణ చర్య.. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో దావా

  • ఏడు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపిన కేరళ ప్రభుత్వం
  • పరిశీలన కోసం ఆయన రాష్ట్రపతికి పంపిన వైనం
  • ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని మండిపాటు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న కేరళ ప్రభుత్వం
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ అరిఫ్ మహ్మద్‌ఖాన్, రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని కోరింది.

యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు- 2022, యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు (నంబర్-2)-2022, యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు (నంబర్-3)-2022, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు-2022తో పాటు మరో మూడు బిల్లులు కలిపి మొత్తం 7 ఆమోదించి అసెంబ్లీ వాటిని గవర్నర్‌కు పంపింది. గవర్నర్ వాటిపై సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. దీనిని కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆమోదించకపోవడానికి ఎలాంటి కారణం లేకుండానే రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తన రిట్‌పిటిషన్‌లో కోరింది. అరిఫ్‌ఖాన్‌పై పిటిషన్‌‌లో గవర్నర్‌ను, గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది. 

కాగా, 11 నుంచి 24 నెలల క్రితం కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లులపై సంతకాలు చేయకుండా ఆపాలంటూ రాష్ట్రపతికి కేంద్రం సూచించడాన్ని కూడా కేరళ ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ బిల్లులన్నీ రాష్ట్రపరిధికి సంబంధించినవని, వీటిని ఆపడం అంటే సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించడం, ఆటంకపరచడం కిందికి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.


More Telugu News