చివరి బంతికి గెలిచిన కోల్‌కతా.. ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ ఓటమి

  • లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిన హైదరాబాద్
  • క్లాసెన్ విధ్వంసంతో ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్
  • చివరి బంతికి 4 పరుగుల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 4 పరుగుల తేడాతో ఐపీఎల్ 2024లో కోల్‌కతా  బోణీ కొట్టగా.. సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకుంది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో 145/5 స్థితిలో హైదరాబాద్ ఓటమి లాంఛనమే అని భావించిన సమయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లో 63 పరుగులు బాదాడు. ఏకంగా 8 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి హైదరాబాద్‌ను రేసులోకి తీసుకొచ్చాడు.

చివరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరమవ్వగా 19వ ఓవర్లో క్లాసెన్‌ 3 సిక్సర్లు, షాబాజ్‌ 1 సిక్స్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా క్లాసెన్ తొలి బంతికే సిక్స్‌ కొట్టాడు. దీంతో హైదరాబాద్ గెలుపు సునాయసమని అంతా భావించారు. కానీ మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. 2వ బంతికి సింగిల్‌ వచ్చింది. 3వ బాల్‌కి షాబాజ్‌ ఖాన్ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా మారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్‌సెన్‌ సింగిల్‌ తీసి క్లాసెన్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. భారీ షాట్‌‌తో మ్యాచ్‌ను ముగించాలని ప్రయత్నించిన క్లాసెన్‌ 5వ బంతికి ఔట్ అయ్యాడు. ఇక సమీకరణం చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా క్రీజులో ఉన్న హైదరాబద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ విఫలమయ్యాడు. దీంతో ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా విజయం సాధించింది.

హైదరాబాద్ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌ (32), అభిషేక్‌ శర్మ (32),రాహుల్‌ త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (18), అబ్దుల్‌ సమద్‌ (15), షాబాజ్‌ అహ్మద్‌ (16) కీలకమైన పరుగులు చేశారు. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా 3 కీలకమైన వికెట్లు తీశాడు. ఆండ్య్రూ రస్సెల్‌ 2, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆండ్య్రూ రస్సెల్స్ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో 64 పరుగులు బాదాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక  ఫిల్ సాల్ట్‌ (54), రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) కీలకమైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ 3, స్పిన్నర్ మార్కండే 2 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 1 వికెట్ తీశారు.


More Telugu News