కేజ్రీవాల్‌కు జైల్లోనే సీఎం కార్యాలయ ఏర్పాటు కోసం కోర్టును కోరుతాం: పంజాబ్ ముఖ్యమంత్రి మాన్

  • జైలు నుంచి పాలన సాగించవద్దని ఎక్కడా నిబంధన లేదన్న భగవంత్ మాన్
  • దోషిగా నిరూపణ అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రిగా జైలు నుంచి పని చేయవచ్చని చట్టం చెబుతోందని వ్యాఖ్య
  • జైల్లో కార్యాలయ ఏర్పాటుకు సుప్రీం కోర్టు, హైకోర్టును అనుమతిని కోరుతామని వెల్లడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం జైల్లో కార్యాలయానికి అనుమతిని కోరుతామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్  చేయడం, ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడం విదితమే. అయితే ఆయన జైలు నుంచి పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలిస్తారని, జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు.

జైలు నుంచి పాలన సాగించకూడదని ఎక్కడా నిబంధన లేదని, దోషిగా నిరూపణ అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రిగా జైలు నుంచి పని చేయవచ్చని చట్టం చెబుతోందని భగవంత్ మాన్ అన్నారు. ఆయన పని చేయడానికి వీలుగా జైల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతిని కోరుతామని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పార్టీ ఏర్పాటు చేసి, పార్టీ సీనియర్ ఫౌండర్ మెంబర్‌గా ఉన్న కేజ్రీవాల్ స్థానాన్ని ఆప్‌లో ఎవరూ భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు.


More Telugu News