ఈ డ్రగ్స్ ను లిక్కర్ లో కలుపుతున్నారని ఒక ఆరోపణ వచ్చింది: కనకమేడల

  • బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల డ్రగ్స్ తో విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్
  • సీజ్ చేసిన అధికారులు
  • రాజకీయ రంగు పులుముకున్న డ్రగ్స్ వ్యవహారం
  • ఏ ప్రభుత్వ సహకారం లేకుండా రూ.50 వేల కోట్ల డ్రగ్స్ ఎలా వచ్చాయన్న కనకమేడల
బ్రెజిల్ నుంచి వచ్చిన 25 వేల కిలోల డ్రగ్స్ విశాఖ తీరంలో పట్టుబడడం ఏపీ రాజకీయ పక్షాల మధ్య దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. 

ఈ డ్రగ్స్ కేసులో సంధ్యా ఆక్వా సంస్థ పేరు వినిపిస్తోందని, సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు వైసీపీకి సన్నిహితుడని వెల్లడించారు. పురందేశ్వరికి ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ సహకారం లేకుండా రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వచ్చాయని కనకమేడల నిలదీశారు. రూ.50 వేల కోట్లతో డ్రైడ్ ఈస్ట్, కొకైన్ తెప్పించగల ఆర్థిక స్తోమత సంధ్యా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావుకు ఉందా? అని ప్రశ్నించారు. 

అంతేకాదు, ఏపీలో లిక్కర్ స్కాం జరుగుతోందని, ఈ డ్రగ్స్ కు దానితో సంబంధం ఉందని అన్నారు. 

ఈ డ్రగ్స్ ను డివైడ్ చేసి, లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల ద్వారా లిక్కర్ లో కలుపుతున్నారన్న ఒక ఆరోపణ ఉందని కనకమేడల తెలిపారు. ఇది నిజమో కాదో తనకు తెలియదని, అందుకే ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ తెప్పించారేమోనన్న సందేహం ఉందని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ కలిపిన లిక్కర్ నే ప్రభుత్వం సరఫరా చేస్తోందనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉందని వివరించారు.


More Telugu News