చంద్రబాబు సమావేశంలోకి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ప్రవేశించాడు: బొండా ఉమ

  • విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్ షాప్
  • సభలోకి విశ్వేశ్వరరావు అనే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ప్రవేశించాడన్న ఉమ
  • ఐజీ పంపితేనే వచ్చానని అతడు చెబుతున్నాడని వెల్లడి
  • ట్యాపింగ్ ఆధారాలు అతడి ఫోన్ లో లభ్యమయ్యాయన్న ఉమ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విజయవాడలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించారని, కానీ ఆ సమావేశంలోకి ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ప్రవేశించాడని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. 

అతడి పేరు విశ్వేశ్వరరావు అని, ఐజీ పంపితేనే తాను ఇక్కడికి వచ్చానని ఆ కానిస్టేబుల్ చెబుతున్నాడని ఉమా వెల్లడించారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కదలికలపై నిఘాతో పాటు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్న ఆధారాలు ఆ కానిస్టేబుల్ ఫోన్ లో తమకు లభ్యమయ్యాయని తెలిపారు. 

ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని... చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. 

గత తెలంగాణ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా అదే రకం సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని ఉమా వివరించారు. 

ఇవాళ, టీడీపీ సమావేశంలోకి కానిస్టేబుల్ ప్రవేశించాడని, అతడి ఫోన్ లో తగిన ఆధారాలున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ఉమా ప్రశ్నించారు.


More Telugu News