విజయవాడ పశ్చిమ టికెట్ నాకే ఇవ్వండి: పవన్ కు నేరుగా విజ్ఞప్తి చేసిన పోతిన మహేశ్

  • విజయవాడ వెస్ట్ టికెట్ పై వీడని సస్పెన్స్
  • ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు
  • పెండింగ్ లో ఉన్న విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం
  • టికెట్ పై ఆశలు పెంచుకున్న పోతిన మహేశ్
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్ టీడీపీకి వెళుతుందా, జనసేనకు వెళుతుందా, బీజేపీకి దక్కుతుందా? అనే అంశం ఇంకా పెండింగ్ లో ఉంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. 

జనసేన నేత పోతిన వెంకట మహేశ్ విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలంటూ బాహాటంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. అయితే, జనసేన నుంచి పోతిన మహేశ్ కు ఇంతవరకు స్పష్టమైన హామీ లభించినట్టు దాఖలాలు లేవు.

తాజాగా ఆయన మరోసారి తన ఆక్రోశం వెలిబుచ్చారు. జనసేన పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్ అడుగుతున్నానని పోతిన మహేశ్ తెలిపారు. తనదేమీ దురాశ కాదని, కొందరు నాయకుల్లాగా తానేమీ ఇక్కడ రాత్రికి రాత్రే ఊడిపడలేదే అని వ్యాఖ్యానించారు. 

తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే పోరాటాలు చేశానని అన్నారు. ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నానని, ఈ జెండ్డా పట్టుకునే నిలబడ్డా, ఈ జెండా పట్టుకునే కలబడ్డా, ఈ జెండా పట్టుకునే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని ఆశపడ్డా అని వివరించారు. 

తన కోరికలో న్యాయం, ధర్మం ఉన్నాయని పోతిన మహేశ్ స్పష్టం చేశారు. అందుకే విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటును జనసేన తరఫున తాను కోరుకుంటున్నానని వివరించారు. 

ఈ కోరికను తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా తెలియజేశానని, ఆయనకు మేం చేసిన పోరాటాలు, మేం పడిన కష్టాలు, మేం ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలుసు అని పోతిన మహేశ్ వెల్లడించారు. అందుకే, విజయవాడ వెస్ట్ సీటు విషయంలో పవన్ కల్యాణ్ న్యాయం చేస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.


More Telugu News