ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ

  • వారాంతం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • ఈ మ్యాచ్ తో మళ్లీ బరిలో దిగుతున్న రిషబ్ పంత్
  • రోడ్డు ప్రమాదం అనంతరం 15 నెలల తర్వాత మ్యాచ్ ఆడుతున్న పంత్
వారాంతం కావడంతో ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటాయి. 

నేటి డబుల్ హెడర్ లో తొలి మ్యాచ్ ఛండీగఢ్ లో జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఓ విశేషం ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ సారథి దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్ ద్వారానే బరిలో దిగుతున్నాడు. దాంతో అందరి దృష్టి పంత్ పైనే ఉండనుంది. 

ఏడాదికి పైగా క్రికెట్ కు దూరమైన నేపథ్యంలో, అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో పంత్ వికెట్ కీపింగ్ చేయనుండడంతో, అతడు పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని అర్థమవుతోంది. 

ఇక, ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ట్రిస్టాన్ స్టబ్స్, షాయ్ హోప్ వంటి విదేశీ స్టార్లతో బలంగా ఉంది. పంత్ కూడా టచ్ లోకి వస్తే ఢిల్లీ జోరుకు అడ్డుకట్ట వేయడం పంజాబ్ బౌలర్లకు శక్తికి మించిన పనే అవుతుంది. బౌలింగ్ లోనూ ఢిల్లీ వనరులు బాగానే ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ కు తోడుగా అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు  పంచుకోనున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్ కు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 

పంజాబ్ కింగ్స్ లైన్ కూడా ఆషామాషీగా ఏమీ లేదు. కెప్టెన్ శిఖర్ ధావన్, ఇంగ్లండ్ స్టార్లు జానీ బెయిర్ స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్ స్టన్ లతో పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో కగిసో రబాడా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ కీలకం కానున్నారు.


More Telugu News