కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ ప్ర‌క‌ట‌న‌.. తీవ్రంగా స్పందించిన భార‌త్‌

  • ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త వ్యవ‌హారాల‌లో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌న్న కేంద్రం
  • అరెస్టు చేయ‌కుండా కూడా కేజ్రీవాల్‌ను విచారించ‌వ‌చ్చ‌న్న జ‌ర్మ‌నీ
  • దోషిగా తేల‌నంత వ‌ర‌కు నేరం చేయ‌న‌ట్లే భావించాల‌నే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వ‌ర్తిస్తుందని వ్యాఖ్య 
  • జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌నపై కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హం
ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ స్పందించిన తీరు ప‌ట్ల‌ భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త వ్యవ‌హారాల‌లో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టింది. ఈ మేర‌కు ఢిల్లీలోని జ‌ర్మ‌నీ రాయ‌బారిని పిలిచి ఆ దేశం చేసిన ప్ర‌క‌ట‌న‌పై విదేశీ వ్య‌వ‌హారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. 

"భార‌త్ ఒక ప్ర‌జాస్వామ్య దేశం. న్యాయ‌వ్య‌వ‌స్థ స్వ‌యంప్ర‌తిప‌త్తి, క‌నీస ప్ర‌జాస్వామ్య సూత్రాలు భార‌త్‌కూ వ‌ర్తిస్తాయి. అంద‌రిలానే నిష్ప‌క్ష‌పాత, న్యాయ‌బ‌ద్ద విచార‌ణ‌కు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయ‌కుండా కూడా అత‌డిని విచారించ‌వ‌చ్చు. దోషిగా తేల‌నంత వ‌ర‌కు నేరం చేయ‌న‌ట్లే భావించాల‌నే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వ‌ర్తిస్తుంది" అని జ‌ర్మ‌నీ ఢిల్లీ సీఎం అరెస్టుపై వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న ఒక‌టి విడుద‌ల చేసింది. ఇదే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం రాత్రి (మార్చి 21న‌) అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత శుక్ర‌వారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా.. న్యాయ‌స్థానం కేజ్రీవాల్‌కు ఆరు రోజుల క‌స్ట‌డీ విధించింది. ఇక కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు దేశంతో పాటు విదేశాల్లోనూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 26న ప్ర‌ధాని మోదీ ఇంటిని కూడా ముట్ట‌డిస్తామ‌ని ఆప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి కూడా కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. ఆయ‌న అరెస్టుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు కూడా వెల్ల‌డించింది.


More Telugu News