కేరళలో ఆలయ వేడుకల్లో ఏనుగుల ఫైట్.. వీడియో ఇదిగో!

  • త్రిస్సూర్ లోని థారక్కల్ ఆలయంలో ఘటన.. పలువురికి గాయాలు
  • శుక్రవారం రాత్రి అంబారీపై ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
  • వేడుకకు భారీగా హాజరైన జనం
కేరళ రాష్ట్రం త్రిస్సూర్ లోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుండగా ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో వేడుకలను చూసేందుకు వచ్చిన జనం భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు.

ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగా మరో ఏనుగుపై దాడి చేసింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది. నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News