భువనగిరి లోక్‌సభ స్థానానికి దరఖాస్తు చేసుకోలేదు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

  • అధిష్ఠానం ఆదేశిస్తే మాత్రం పోటీచేస్తామన్న రాజగోపాల్‌రెడ్డి
  • సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పామన్న ఎమ్మెల్యే
  • కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువన్న రాజగోపాల్‌రెడ్డి
  • 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా
భువనగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాము ఆ స్థానం కోసం ప్రయత్నించడం వల్లే అధిష్ఠానం దానిని పెండింగ్‌లో పెట్టిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆ సీటు కోసం తాము దరఖాస్తు కూడా చేసుకోలేదని పేర్కొన్నారు. ఒకవేళ అధిష్ఠానం పోటీచేయమని ఆదేశిస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని తెలిపారు. 

సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పామని, అంతే తప్ప పదవుల కోసం పాకులాడే రకం తాము కాదని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్‌గా లక్ష్మి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఆమెకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్టు పార్టీలకు అతీతంగా ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 14 ఎంపీ స్ఠానాల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో అత్యధిక మెజార్టీ తెచ్చే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. 

మంత్రివర్గంలో కీలక పదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందని, ఆలస్యమైనా పదవి వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తమ సోదరులను విడదీయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని, ప్రాణం ఉన్నంత వరకు కలిసే ఉంటామని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు


More Telugu News