ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం వెనుక 2007లో ఏం జరిగిందో చెప్పిన సచిన్ టెండూలర్క్

  • ధోనీని కెప్టెన్ చేయడంతో తన పాత్ర కూడా ఉందన్న క్రికెట్ దిగ్గజం
  • తనను కెప్టెన్ గా ఉండాలని కోరిన నాటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్
  • ఆ ప్రతిపాదనను తిరస్కరించి ధోనీ పేరుని సూచించానని వెల్లడి
  • ధోనీ సహజసిద్ధమైన ఆటగాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడన్న సచిన్  
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోనీ వైదొలగిన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2007లో మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా కెప్టెన్‌గా నియమించడానికి నాటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్‌ను ఒప్పించడంలో తన పాత్ర కూడా ఉందని ‘మాస్టర్ బ్లాస్టర్’ తెలిపారు.

2007లో బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న శరద్ పవార్ భారత్‌ జట్టుకు నాయకత్వం వహించమంటూ తనను అడిగారని, అయితే అందుకు తిరస్కరించి ఎంఎస్ ధోనీ పేరుని ప్రతిపాదించానని సచిన్ వెల్లడించారు. ధోనీలో మంచి లక్షణాలు ఉన్నాయని తాను పరిశీలించానని, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడితో చాలాసార్లు మాట్లాడానని సచిన్ వెల్లడించారు. ‘‘మ్యాచ్ మధ్యలో ఈ పరిస్థితిలో నువ్వైతే ఏం చేస్తావ్ అని ప్రశ్నించేవాడిని. ధోనీ నుంచి సమతుల్యమైన సమాధానాలు వచ్చేవి. ధోనీ చాలా సహజసిద్ధమైన ఆటగాడు. మ్యాచ్‌ను అర్థం చేసుకోవడంలో దిట్ట’’ అని సచిన్ కొనియాడారు. ఐపీఎల్ టోర్నీ ప్రారంభం సందర్భంగా ‘జియో సినిమా మ్యాచ్ సెంటర్‌’తో సచిన్ మాట్లాడారు. చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగడంపై సచిన్ ఈ విధంగా స్పందించాడు.

ధోనీ మనస్సు చాలా స్థిరంగా ఉంటుందని, చాలా ప్రశాంతంగా ఉంటాడని సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సహజసిద్ధంగా ఉంటాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడికి అతడి పేరుని సిఫార్సు చేయడానికి ఇదే కారణమని, అతడిలో నాయకత్వ లక్షణాలను తాను గమనించానని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరానని వివరించారు. 

కాగా ఎంఎస్ ధోనీ భారత్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఏకంగా 5 టైటిల్స్ అందించాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించాడు. ఆ జట్టు తదుపరి కెప్టెన్‌గా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ధోనీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.


More Telugu News