విశాఖ డ్రగ్స్‌ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను విచారించాలి: పేర్ని నాని

  • విశాఖలో భారీగా పట్టుబడిన మత్తు పదార్థాలు
  • చంద్రబాబు ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ
  • విదేశాల్లోని మాఫియాతో అంటకాగిన చరిత్ర చంద్రబాబుదన్న పేర్ని నాని
విశాఖలో 25 వేల కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకోవడం కలకలం రేపుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అవాస్తవాలతో చంద్రబాబు చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఏవో కూడా తెలియకుండానే వైసీపీపై చంద్రబాబు విషం చిమ్మారని మండిపడ్డారు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకు వచ్చేశారని... ఈ కంపెనీలతో చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ లపై విచారణ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. 

గతంలో సింగపూర్ మంత్రిని చంద్రబాబు తెచ్చారని... ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారని పేర్ని నాని తెలిపారు. ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదని అన్నారు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరామని చెప్పారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని.. చెక్కులు పంచి పెట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. 


More Telugu News