2024 పారిస్ ఒలింపిక్స్‌కు ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్‌

  • ఈ ఏడాది జులై-ఆగస్టుల‌లో పారిస్ ఒలింపిక్స్‌
  • భారత జట్టుకు సంబంధించిన కీలక అధికారుల నియామ‌కాల‌పై భారత ఒలింపిక్ సంఘం ప్ర‌క‌ట‌న 
  • భార‌త బృందానికి చెఫ్ డి మిషన్‌గా బాక్సింగ్ దిగ్గ‌జం మేరీ కోమ్ 
  • షూటింగ్ విలేజ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్‌గా గగన్ నారంగ్ 
  • చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ దిన్షా పార్దివాలా
  • ఈ నియామ‌కాల‌పై ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష హ‌ర్షం
ఈ ఏడాది జులై-ఆగుస్టుల‌లో జ‌రిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత జట్టుకు సంబంధించిన కీలక అధికారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తాజాగా నియ‌మించింది. దీనికి సంబంధించి గురువారం ఐఓఏ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జులై 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ ప్రారంభోత్స‌వంలో భార‌త క్రీడాకారుల బృందానికి భార‌త టేబుల్ టెన్నిస్ దిగ్గ‌జం ఆచంట‌ శరత్ కమల్ ప‌తాక‌ధారిగా వ్య‌హ‌రిస్తాడు. అలాగే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ భార‌త జ‌ట్టుకు చెఫ్ డి మిషన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని భార‌త ఒలింపిక్ సంఘం ప్ర‌క‌టించింది. కాగా, 2020లో టోక్యో ఒలింపిక్ క్రీడలలో మేరీ కోమ్‌తో పాటు పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ భారత పతాకధారులుగా ఉన్న విష‌యం తెలిసిందే. 

"ఈ నియామకాలు అథ్లెట్ల‌ అనుభవం, నైపుణ్యం, నాయకత్వ బాధ్య‌త‌ల‌ను సూచిస్తాయి. ఇవి అథ్లెట్లకు ప్రపంచ వేదికలపై మ‌రింత గౌర‌వాన్ని, దేశం త‌ర‌ఫున వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దోహదపడతాయి. చెఫ్ డి మిషన్‌గా భార‌త‌ బృందానికి నాయకత్వం వహించ‌డానికి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ అన్ని విధాల అర్హురాలు. దీనికి కార‌ణం క్రీడల పట్ల ఆమెకున్న అసమానమైన అంకితభావం, స్ఫూర్తిదాయకమైన ఆమె ఒలింపిక్ ప్రయాణం. ఇవి ఒలింపిక్స్‌లో మా అథ్లెట్లకు మార్గదర్శకం" అని ఐఓఏ త‌న‌ పత్రికా ప్రకటన‌లో పేర్కొంది. 

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత కీలక అధికారులు 
ప‌తాక‌ధారి - శరత్ కమల్
చెఫ్ డి మిషన్ - మేరీ కోమ్
డిప్యూటీ చెఫ్ డి మిషన్ - శివ కేశవన్
షూటింగ్ విలేజ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్ - గగన్ నారంగ్
చీఫ్ మెడికల్ ఆఫీసర్ - డాక్టర్ దిన్షా పార్దివాలా
ఐఏఓ మీడియా ప్ర‌తినిధి - జి రాజారామన్
సోషల్ మీడియా హెడ్ - సర్వేష్ కేడియా

ఈ నియామ‌కాల‌పై ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష హ‌ర్షం వ్య‌క్తం చేశారు. "పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల కోసం భార‌త జ‌ట్టుకు నాయకత్వం వహించే సమర్థులైన అధికారుల బృందాన్ని కలిగి ఉన్నందుకు ఆనందంగా ఉంది. వారి నైపుణ్యం, అంకితభావం, క్రీడల పట్ల మక్కువ నిస్సందేహంగా మా అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న‌ క‌న‌బ‌రిచి దేశం గర్వించేలా చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు" అని పీటీ ఉష చెప్పుకొచ్చారు.


More Telugu News