కర్మ వెంటాడుతుంది: కేజ్రీవాల్ అరెస్ట్ పై ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ముఖర్జీ

  • షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్, అన్నా హజారే గ్యాంగ్ నిరాధార ఆరోపణలు చేశారన్న షర్మిష్ట
  • ఆ దారుణ చర్యలకు ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్య
  • కాసేపట్లో కోర్టులో కేజ్రీని ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడే ఉన్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో కేజ్రీవాల్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టబోతున్నారు. ఆయనను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అడగబోతున్నట్టు సమాచారం. 

మరోవైపు, కేజ్రీవాల్ అరెస్ట్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ముఖర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజ్రీవాల్, అన్నా హజారే గ్రూప్ ఆమెపై నిరాధారమైన ఎన్నో ఆరోపణలు చేశారని షర్మిష్ట విమర్శించారు. షీలాపై చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రజలకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక పోయారని అన్నారు. కర్మ వెంటాడుతుందని కేజ్రీవాల్ అరెస్ట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరైతే గతంలో అసత్య, నిరాధార ఆరోపణలు చేశారో... ఆ చర్యలకు వారంతా ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News