జైల్లో ఉండి సీఎం బాధ్యతలు నిర్వర్తించవచ్చా?.. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆసక్తికర సందేహం

  • అరెస్ట్ అయినా జైలు నుంచి పాలన సాగిస్తారని గత రాత్రి ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • గతంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులు సీఎం పదవికి రాజీనామాల సమర్పణ
  • కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుందనే పరిణామాలను ఆరా తీస్తున్న కేంద్రం
  • గతంలో ముఖ్యమంత్రులు ఎవరూ జైలు నుంచి పాలన సాగించలేదన్న తీహార్ జైలు ఉన్నతాధికారి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జైలు నుంచే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రాత్రి ప్రకటించింది. సీఎం విషయంలో వేరే ఆలోచన లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచే పని చేస్తారని, అలా చేయకుండా కేజ్రీవాల్‌ను అడ్డుకునే చట్టం ఏదీ లేదని, అతడికి ఇంకా శిక్ష పడలేదని ఆప్ పేర్కొంది. అయితే జైలు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్న సమయంలోనే అరెస్టయ్యారని, అయితే సీఎం బాధ్యతలను భార్య రబ్రీ దేవికి అప్పగించారని గుర్తుచేస్తున్నారు. ఇక ఇటీవలే భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం గవర్నర్‌ను కలిసి రాజీనామాను చేశారని ప్రస్తావిస్తున్నారు.

మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవనున్నాయనే పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వోద్యోగి (ఐఏఎస్) కావడంతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, లేదా పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టుకు గురైన ప్రభుత్వాధికారులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంని, వెంటనే సర్వీసు నుంచి సస్పెండ్ చేయవచ్చని సూచిస్తున్నారు.

ఇక కోర్ట్ రిమాండ్ విధిస్తే కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలుకు చెందిన టాప్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గతంలో ముఖ్యమంత్రులు జైలు నుంచి బాధ్యతలు చేపట్టిన సందర్భం లేదని తెలిపారు. జైలు నిబంధనల్లో అలాంటి ప్రస్తావన లేదని, జైలులో ప్రతిదీ మాన్యువల్ ప్రకారం జరుగుతుందని ఆయన వివరించారు. కాగా ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఆయన అరెస్టు అయిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


More Telugu News