భూటాన్ కు ఒక రోజు ఆలస్యంగా బయల్దేరిన మోదీ.. కారణం ఇదే!

  • రెండు రోజుల భూటాన్ పర్యటనకు బయల్దేరిన మోదీ
  • ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిన్నటి ప్రయాణం వాయిదా
  • ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యమన్న మోదీ
రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని నరేంద్ర మోదీ హిమాలయ దేశం భూటాన్ కు బయల్దేరారు. ఈ ఉదయం ఆయన భూటాన్ కు పయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నిన్ననే భూటాన్ కు వెళ్లాల్సి ఉంది. శనివారం నాడు భారత్ కు తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఆయన ప్రయాణం ఈరోజుకు వాయిదా పడింది. 

భూటాన్ కు బయల్దేరుతున్న సమయంలో మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... 'భారత్ - భూటాన్ దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో నేను వివిధ కార్యక్రమాలకు హాజరవబోతున్నా. భూటాన్ రాజు గ్యాల్పో, ఆ దేశ ప్రధానితో చర్చల కోసం ఎదురుచూస్తున్నా' అని ట్వీట్ చేశారు. 

భారత్ తన పొరుగు దేశాలతో ఐక్యతను పెంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భూటాన్ తో కూడా పలు అంశాలపై మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. 'నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ'లో భాగంగా భూటాన్ లో మోదీ పర్యటిస్తున్నారు.


More Telugu News