ప్రపంచంలో తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చిన వైద్యులు
- అమెరికాలో మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యుల ఘనత
- ఈ నెలలోనే ఆపరేషన్, రోగి కోలుకుంటున్నారన్న వైద్యులు
- సజీవంగా ఉన్న వ్యక్తికి ఈ ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని వెల్లడి
అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో మరో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు. సజీవంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి కిడ్నీ అమర్చడం ఇదే తొలిసారని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు గురువారం తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని చెప్పారు. రోగి ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నారని అన్నారు. గతంలో పంది మూత్ర పిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. పంది గుండెలను గతంలో ఇద్దరికి అమర్చగా వారు కొన్ని నెలల వ్యవధిలోనే మరణించారని గుర్తు చేసుకున్నారు.