కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉంది: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
  • లోక్ సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం అంటూ చద్దా ఫైర్
  • కేజ్రీవాల్ ను ఎవరూ టచ్ చేయలేరంటూ ట్వీట్
  • ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ, ఆయన భావజాలాన్ని అరెస్ట్ చేయలేరని వెల్లడి
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. 

కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను టచ్ చేయడం ఎవరి వల్లా కాదని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. 

"ఆప్ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్ లో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ, ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు" అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.


More Telugu News