ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో విచారణ... అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్బీఐ

  • ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు
  • ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి అప్పగించాలని ఎస్బీఐకి ఆదేశాలు
  • సీరియల్ నెంబర్లు లేకుండా డేటా అందించిన బ్యాంకు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఇటీవల ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాంకు) అందించిన వివరాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అరకొర వివరాలు కాకుండా, ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని తాము ఆదేశిస్తే, తమ ఆదేశాలను పాటించకపోవడం ఏంటని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మార్చి 21 సాయంత్రం 5 గంటల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది. 

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎస్బీఐ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. సీరియల్ నెంబర్లతో సహా ఎన్నికల బాండ్ల వివరాల డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్ లో వెల్లడించింది. భద్రతా కారణాల వల్ల బ్యాంకు అకౌంట్ నెంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని ఎస్బీఐ వివరణ ఇచ్చింది. 

దేశంలో ఎన్నికల బాండ్ల వ్యవహారం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్లను రద్దు  చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఐదేళ్లలో వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. 

అయితే, ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించిన బ్యాంకు... వాటి సీరియల్ నెంబర్లను మాత్రం పంచుకోలేదు. దాంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


More Telugu News