పాకిస్థాన్ మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌!

  • అనారోగ్యంతో క‌న్నుమూసిన స‌యీద్ అహ్మ‌ద్
  • 1958-73 మధ్య పాక్‌ త‌ర‌ఫున 41 టెస్టులు ఆడిన మాజీ క్రికెట‌ర్‌
  • 1958లో విండీస్‌తో టెస్టు ద్వారా అరంగేట్రం 
  • 1969లో పాక్ టెస్టు జట్టు సార‌థిగా బాధ్య‌త‌లు
  • కేవ‌లం మూడు మ్యాచుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కెప్టెన్సీ
  • 1972-73లో మెల్‌బోర్న్ వేదిక‌గా చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడిన అహ్మ‌ద్
పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌యీద్ అహ్మ‌ద్ (86) అనారోగ్యంతో క‌న్నుమూశారు. అహ్మ‌ద్ 1958-73 మధ్య‌ పాకిస్థాన్ త‌ర‌ఫున 41 టెస్టులు ఆడారు. 5 సెంచ‌రీలు, 16 అర్ధ శ‌త‌కాల సాయంతో 2991 ప‌రుగులు చేశారు. కాగా, అహ్మ‌ద్ కొట్టిన‌ ఐదు శ‌త‌కాల‌లో మూడు భార‌త్‌పైనే న‌మోదు చేశారు. రైట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన స‌యీద్ అహ్మ‌ద్ 22 వికెట్లు కూడా తీశారు. 

1958లో విండీస్‌తో బ్రిడ్జ్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు ద్వారా అరంగేట్రం చేశారు. 1972-73లో మెల్‌బోర్న్ వేదిక‌గా త‌న చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడారు. అహ్మ‌ద్ పాకిస్థాన్‌కు ఆరో టెస్టు కెప్టెన్‌. పాక్ దిగ్గ‌జం హ‌నీఫ్ మ‌హ్మ‌ద్ త‌ర్వాత ఆ జ‌ట్టు ప‌గ్గాలు 1969లో ఈయ‌న‌కే ద‌క్కాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టించిన పాక్ జ‌ట్టుకు ఆయ‌న కెప్టెన్‌గా ఉన్నారు. 

అయితే, అహ్మ‌ద్ కేవ‌లం మూడు టెస్టుల‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇక మాజీ టెస్టు సార‌థి మృతిప‌ట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ సంతాపం తెలిపారు. సయీద్ అహ్మ‌ద్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.


More Telugu News