ముఖ్యమంత్రిని అవుతానని నేను అనుకుంటే అంతకంటే బుద్ధితక్కువ లేదు: పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్‌లో నేను జూనియర్‌ని... అలాంటప్పుడు సీఎంను ఎలా అవుతానని ప్రశ్న
  • ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారన్న పొంగులేటి
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 11 సీట్లు గెలుచుకుంటుందని ధీమా
ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ లేదన్నారు. గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో తాను జూనియర్‌ని అని... అలాంటప్పుడు తాను ముఖ్యమంత్రిని ఎలా అవుతాను? అని ప్రశ్నించారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 లోక్ సభ స్థానాలను కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్లలో పోటా పోటీ ఉంటుందని, బీజేపీ రెండు సీట్లలో మాత్రమే గెలుస్తుందని, ఇక బీఆర్ఎస్ ఒకటి లేదా రెండు సీట్లు గెలుచుకోవచ్చునని జోస్యం చెప్పారు. తాము ఇంకా పార్టీలోకి గేట్లు ఎత్తలేదని... ఎత్తితే కనుక బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతోందని విమర్శించారు.

రాష్ట్రంలో తాగునీటి కొరతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల డ్యామేజ్‌తో ఆగదని... మొత్తం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని స్టోర్ చేయాలని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.


More Telugu News