చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓడించారు: సజ్జల

  • 'మహాదోపిడీ' పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు
  • పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల
  • రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శలు
  • దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడి
సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన 'మహాదోపిడీ' అనే పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓటుతో బుద్ధి చెప్పారని వివరించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా దోపిడీ సాగించారో అందరికీ తెలుసని అన్నారు. 

చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడన్న విషయాన్ని 'మహాదోపిడీ' పుస్తకంలో రచయిత విజయబాబు చక్కగా వివరించారని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులను చంద్రబాబు దోచుకున్న విధానాన్ని కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని వివరించారు. 

రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగిందని సజ్జల విమర్శించారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దృష్టంతా మళ్లీ అధికారం చేజిక్కించుకోవడంపైనే ఉందని, అందుకోసం పవన్ కల్యాణ్ ను, బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.


More Telugu News