ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

  • ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు
  • ఇప్పటికే కొందరు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించిన టీడీపీ, జనసేన
  • మిగిలిన అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాలపై నేడు చంద్రబాబు, పవన్ చర్చ
  • ఉమ్మడి ప్రచార వ్యూహంపైనా సమాలోచనలు
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేడు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. 

ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏపీలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు. 

ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు. 

ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.


More Telugu News