ఈసారి ఐపీఎల్‌లో కొత్త రూల్‌.. ఇటీవ‌ల ఐసీసీ తీసుకొచ్చిన ఆ రూల్‌కు మాత్రం బ్రేక్‌!

  • రేపే ఐపీఎల్-2024 సీజ‌న్ ప్రారంభం
  • చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ‌ధ్య తొలి మ్యాచ్‌
  • ఘ‌నంగా ప్రారంభ వేడుక‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు
  • ఈ 17వ‌ సీజ‌న్‌లో బౌల‌ర్ల‌కు ఓవ‌ర్‌కు రెండు షార్ట్ బాల్స్ (బౌన్స‌ర్‌) వేసుకునే వెసులుబాటు
  • ఐసీసీ తీసుకొచ్చిన 'స్టాప్ క్లాక్' రూల్‌కు నో ఛాన్స్‌
రేప‌టి నుంచి ఐపీఎల్‌-2024కు తెర‌లేవ‌నుంది. సుమారు రెండున్న‌ర నెల‌ల పాటు క్రికెట్ అభిమానుల‌కు వినోదాన్ని అందించ‌నుంది. ఇప్ప‌టికే టోర్నీలో పాల్గొనే ప‌ది జ‌ట్లు ప్రాక్టీస్ ముమ్మ‌రం చేశాయి. ఇక ఈ 17వ సీజ‌న్ శుక్ర‌వారం చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగే చెన్నై సూప‌ర్ కింగ్స్, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ్యాచ్‌తో మొద‌లు కానుంది. 

అంత‌కంటే ముందు ప్రారంభ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రారంభ వేడుక‌ల్లో ఏఆర్ రెహ‌మాన్‌, సోను నిగ‌మ్‌, అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉండ‌నున్నాయి. ఇదిలాఉంటే.. ఈసారి ఐపీఎల్‌లో కొన్ని కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.

గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఓవ‌ర్‌కు ఒక బౌన్స‌ర్ మాత్రమే వేయాల‌నే రూల్ ఉండేది. ఈసారి ఈ రూల్‌ను మారుస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఓవ‌ర్‌కు రెండు షార్ట్ బాల్స్ (బౌన్స‌ర్‌) వేసుకోవ‌చ్చు. ఈ రూల్‌ను బీసీసీఐ ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమ‌లు చేసింది. అలాగే స్టంపింగ్ కోసం థ‌ర్డ్ అంపైర్‌కు రెఫ‌ర్ చేసిన‌ప్పుడు ముందుగా క్యాచ్‌ను చెక్ చేసే రూల్‌ యధావిధిగా కొన‌సాగనుంది. 

ఇంకా ఔట్‌, నాటౌట్‌తో పాటు వైడ్‌, నో బాల్ కోసం ఒక్కో జ‌ట్టుకు రెండు రివ్యూల‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఐసీసీ తీసుకొచ్చిన 'స్టాప్ క్లాక్' రూల్‌ను అమ‌లు చేయ‌డం లేదు. కాగా, ఈ రూల్ ప్రకారం ఓవ‌ర్ పూర్త‌యిన వెంట‌నే బౌలింగ్ సైడ్ టీమ్‌ 60 సెక‌న్ల లోపు మ‌రో ఓవ‌ర్ మొద‌లు పెట్టాల్సి ఉంటుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో నిర్ణీత‌ స‌మ‌యంలోపు మ్యాచ్‌ల‌ను పూర్తి చేయాల‌నే ఉద్దేశంతో ఐసీసీ ఈ రూల్‌ను తీసుకోచ్చింది.


More Telugu News