దిగొచ్చిన పతంజలి.. సుప్రీంకోర్టుకు క్షమాపణ

  • తప్పుడు ప్రకటనల కేసులో పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • బాబా రాందేవ్, బాలకృష్ణకు నోటీసులు
  • ఇకపై అలాంటి ప్రకటనలు రాకుండా చూసుకుంటామన్న పతంజలి
వినియోగదారులను తప్పుడు ప్రకటనలతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణలు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానానికి పతంజలి క్షమాపణలు చెప్పింది. 

పతంజలి ఆయుర్వేద సంస్థ ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ లో పతంజలిని మందలించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. తమ ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇకపై అలాంటి ఉల్లంఘనలు జరగవని సుప్రీంకోర్టుకు పతంజలి తెలిపింది. అయినప్పటికీ, ప్రకటనలు వస్తుండటంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో, పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని అఫిడవిట్ లో పతంజలి ఎండీ బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు రాకుండా చూసుకుంటామని చెప్పారు. తమ ఉత్పత్తుల ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.


More Telugu News