బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ?

  • వరుణ్ గాంధీకి ఫిలిబిత్‌ సీటు టిక్కెట్‌ ఇవ్వడంపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • వరుణ్ కు బీజేపీ టిక్కెట్ నిరాకరించొచ్చంటూ జాతీయ మీడియాలో కథనాలు 
  • వరుణ్ గాంధీకి టిక్కెట్‌పై సమాధానం దాటవేసిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే వరుణ్ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే అకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వరుణ్ గాంధీ ప్రతినిధులు ఫిలిబిత్‌లో నాలుగు నామినేషన్ పేపర్లు కొనుగోలు చేసి మళ్లీ ఢిల్లీకి వెళ్లినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, ప్రధాని మోదీ సారథ్యంలోని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫిలిబిత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2019లో వరుణ్ గాంధీ మూడోసారి యూపీలోని ఫిలిబిత్‌ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. అయితే, వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వొద్దని కోర్ కమిటీ మీటింగ్‌లో రాష్ట్రస్థాయి నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. 

మరోవైపు, వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న దానిపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమాధానాన్ని దాటవేశారు. ‘‘వేరే పార్టీల్లో ఎవరికి టిక్కెట్లు వస్తున్నాయో? రావట్లేదో? అన్న విషయాలు నాకు తెలీదు. వరుణ్‌కు టిక్కెట్ ఇవ్వాలా? వద్దా? అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది’’ అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. 

మరోవైపు, వరుణ్‌ గాంధీ ఈ మధ్యకాలంలో పరోక్షంగా పలుమార్లు బీజేపీని టార్గెట్ చేశారు. ఒకానొక మీటింగ్‌లో ఆయన మాట్లాడుతుండగా ఓ సాధువు ఫోన్ మోగింది. ఈ క్రమంలో పార్టీ వర్కర్లు ఆయనను ఫోన్ ఆపాలని సూచిస్తుండగా వరుణ్ అడ్డుకున్నారు. ‘‘ఆయనను డిస్టర్బ్ చేయొద్దు. ఆయన ఎప్పుడైనా సీఎం కావచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి’’ అంటూ సెటైర్లు పేల్చారు. పేషెంట్ మృతితో అమెథీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయడంపై కూడా ఆయన రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


More Telugu News