మహ్మద్ షమీ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకున్న గుజరాత్ టైటాన్స్

  • సందీప్ వారియర్ అనే కొత్త పేసర్‌ని తీసుకున్న గుజరాత్ టైటాన్స్
  • మధుశంక స్థానంలో అండర్-19 వరల్డ్ కప్ హీరో క్వేనా మఫాకాను జట్టులోకి తీసుకున్న ముంబై ఇండియన్స్
  • అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ పాలక మండలి
చీలమండ గాయానికి సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్ అనే కొత్త ఫాస్ట్ బౌలర్‌ను గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ప్రకటించింది. షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అతడి స్థానంలో తీసుకున్న సందీప్ ఇప్పటివరకు 5 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడని వెల్లడించింది. సందీప్ ను బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి గుజరాత్ దక్కించుకున్నట్టు వివరించింది. మరోవైపు గాయం కారణంగా 2024 ఎడిషన్‌ నుంచి మధుశంక వైదొలగడంతో అతడి స్థానంలో అండర్-19 వరల్డ్ కప్‌లో మెరిసిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వేనా మఫాకాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుందని ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లు ఆడాడు.

మధుశంక ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌కు దూరమయ్యాడని ఐపీఎల్ పాలకమండలి నిర్ధారించింది. దిల్షాన్ మధుశంక గాయం కారణంగా తొలగాడని తెలిపింది. అతడి స్థానంలో తీసుకున్న క్వేనా మఫాకా దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడని, ఎడమచేతి వాటం పేసర్ అని తెలిపింది. ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడని పేర్కొంది. బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి ముంబై ఇండియన్స్ అతడిని జట్టులో చేర్చుకుందని వివరించింది.





More Telugu News