రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న శ్రీలంక‌ స్టార్ క్రికెట‌ర్‌కు ఊహించ‌ని షాకిచ్చిన ఐసీసీ!

  • వనిందు హసరంగాపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ
  • బంగ్లాదేశ్‌తో జ‌రిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు దూరం
  • ఫీల్డ్ అంపైర్ పట్ల శ్రీలంక స్పిన్న‌ర్‌ దురుసు ప్రవర్తన‌
  • బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఘ‌ట‌న‌
  • ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద హ‌స‌రంగాపై బ్యాన్‌
శ్రీలంక స్పిన్న‌ర్‌ వనిందు హసరంగా బోర్డు సూచ‌న మేర‌కు త‌న టెస్టు రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌ వ‌న్డేలు, టీ20ల‌పై దృష్టిసారించేందుకు గ‌తేడాది టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. కానీ, తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు సూచ‌న మేర‌కు త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. దాంతో ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో జ‌రిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు లంక జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. అయితే, హ‌స‌రంగా ఇలా త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఐసీసీ అత‌నికి ఊహించ‌ని షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద హసరంగపై రెండు టెస్టు మ్యాచుల‌పై నిషేధం విధించింది. 

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఫీల్డ్ అంపైర్ పట్ల హసరంగా దురుసుగా ప్రవర్తించ‌డ‌మే దీనికి కార‌ణం. ఓవర్ పూర్త‌యిన త‌ర్వాత‌ అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను అత‌డు బలవంతంగా లాక్కున్నాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీనిని నేరంగా పరిగణిస్తారు. దీంతో హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు జారీ చేయడం జ‌రిగింది.

ఇక హసరంగా ఖాతాలో ఇంతకుముందే 5 డీమెరిట్ పాయింట్లున్నాయి. దీంతో ప్రస్తుతం అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కి చేరింది. దీంతో ఈ నేరం కింద హసరంగాపై రెండు టెస్టులు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20లు నిషేధం విధించబడుతుంది. ఇందులో ఏది మొదటగా జరిగితే దానిపై నిషేధం ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ లెక్కన శ్రీలంక తర్వాత టెస్టులు ఆడనుంది. దీంతో హసరంగాపై రెండు టెస్టుల నిషేధం పడింది. 

ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు హసరంగా దూరమయ్యాడు. ఒకవేళ హసరంగా టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే టీ20లకు దూరం కావాల్సి వచ్చేది. శ్రీలంక తర్వాత తమ టీ20 క్రికెట్‌ను జూన్‌లో జరిగే ప్రపంచకప్‌లోనే ఆడనుంది. దీంతో అప్పుడు శ్రీలంక ఆడే మొదటి 4 మ్యాచ్‌లకు హసరంగా దూరం కావాల్సి వచ్చేది. కాగా అతనిపై నిషేధం విధించడం ఇది తొలిసారి ఏం కాదు. గతంలో ఆఫ్గ‌నిస్థాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కూడా పలు తప్పిదాలకు పాల్పడి బ్యాన్‌ ఎదుర్కొన్నాడు.

ఇక‌ ఐపీఎల్‌లో హ‌స‌రంగా హైద‌రా‌బాద్ స‌న్ రైజ‌ర్స్ (ఎస్ఆర్‌హెచ్) కు ఆడుతున్నాడు. ఈ స్పిన్న‌ర్‌ను హైద‌రాబాద్ రూ.1.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇప్పుడు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఆడే కొన్ని మ్యాచుల‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. అయితే, నిషేధం కార‌ణంగా ప్రారంభ మ్యాచుల‌కు అత‌డు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాగా, ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌న తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న కోల్‌క‌తాతో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 27న ముంబై ఇండియ‌న్స్‌తో, 31న గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.


More Telugu News