అప్పట్లో నేను రూమ్ రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నానని చిరంజీవిగారికి తెలిసింది: 'ఆలీతో సరదాగా'లో హీరో శివాజీ

  • 'మాస్టర్' సినిమా ముచ్చట్లు చెప్పిన శివాజీ 
  • చిరంజీవిగారు హెల్ప్ చేశారని వెల్లడి 
  • మళ్లీ నటన వైపు రావాలనుకోలేదని వ్యాఖ్య
  • వెబ్ సిరీస్ సక్సెస్ ఉత్సాహాన్ని తెచ్చిందని వివరణ  

శివాజీ .. హీరోగా అనేక సినిమాలు చేశాడు. ఆ తరువాత సినిమాలకి కొంతకాలం పాటు దూరంగా ఉన్న ఆయన, రీసెంటుగా ఒక వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ఆయన, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను హీరోగా 60 - 70 సినిమాలు చేశాను. కేరక్టర్ ఆర్టిస్టుగా ఓ పాతిక సినిమాల వరకూ చేశాను. ఈ ఏడాదిలో 100 పూర్తి చేస్తాననే నమ్మకం ఉంది" అన్నారు. 

'మాస్టర్' సినిమాలో నేను ఒక చిన్న వేషం వేశాను. ఆ సినిమా సమయంలో చిరంజీవిగారితో కలిసి మేమంతా శ్రీశైలం నుంచి వస్తున్నాము. అప్పుడు నా గురించి చిరంజీవిగారికి వేణుమాధవ్ చెప్పాడు. 'అన్నా .. శివాజీ రూమ్ రెంటు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు .. టెన్షన్ పడుతున్నాడు' అని చెప్పాడు. 'అవునా ..' అంటూ చిరంజీవిగారు వెంటనే పదివేల రూపాయలు తీసి ఇచ్చారు. ఆ డబ్బులు నాకు ఆరు .. ఏడు నెలలు వచ్చాయి" అని చెప్పారు. 

"ఇకపై సినిమాలు చేయకూడదనే అనుకున్నాను. వెనక్కి వస్తే ఓడిపోయాడని చెప్పుకుంటారు .. అందువలన రాదలచుకోలేదు. కానీ మా చిన్నబ్బాయి మళ్లీ నటించమని అనడం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లోనే వెబ్ సిరీస్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో మళ్లీ మునుపటి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉంది" అని అన్నారు. 


More Telugu News