ప్లీజ్‌.. న‌న్ను అలా పిల‌వ‌కండి.. ఇబ్బందిగా ఉంది: విరాట్ కోహ్లీ

  • చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్‌సీబీ అన్‌బాక్స్ కార్య‌క్ర‌మం
  • త‌న‌ను కింగ్ కోహ్లీ అని పిల‌వొద్దంటూ విరాట్ స్వీట్ వార్నింగ్‌
  • కేవ‌లం విరాట్ అని పిలిస్తే చాల‌న్న‌ ర‌న్ మెషీన్ 
  • ఆర్‌సీబీ మ‌హిళా జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డం ప‌ట్ల హర్షం
మ‌రో రెండు రోజుల్లో ఐపీఎల్-2024 టోర్నీకి తెర‌లేవ‌నుంది. అయితే, ఐపీఎల్ 17వ‌ సీజ‌న్ ప్రారంభానికి ముందు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ (ఆర్‌సీబీ) మంగ‌ళ‌వారం రాత్రి బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్‌సీబీ అన్‌బాక్స్ పేరిట ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో ఆర్‌సీబీ అభిమానులు వ‌చ్చారు. ఇక విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జ‌ట్టుకు ఐపీఎల్ టోర్నీ మొద‌టి సీజ‌న్ (2008) నుంచి ఆడుతున్నాడు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆయ‌న‌ను 'కింగ్ కోహ్లీ' అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో విరాట్ కోహ్లీ ఇదే విష‌యమై హోస్ట్ దానీష్ సేత్‌తో పాటు అభిమానుల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

"ప్లీజ్‌.. మీరు నన్ను కింగ్ కోహ్లీ అని పిల‌వొద్దు. నాకు ఇబ్బందిగా ఉంది. ముందు మీరు అలా పిల‌వ‌డం ఆపండి. విరాట్ అని పిల‌వండి చాలు. ఇదే విష‌యం డుప్లేసిస్‌తో కూడా చ‌ర్చించాను. మీరు ప్ర‌తిసారి నన్ను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇప్ప‌టి నుంచి ఆ ప‌దాన్ని ఉప‌యోగించ‌కండి. కేవ‌లం విరాట్ అని పిలిస్తే చాలు" అని కోహ్లీ తెలిపాడు. 

ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఇటీవ‌ల డ‌బ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ మ‌హిళా జ‌ట్టును బెంగ‌ళూరు యాజ‌మాన్యం ఘ‌నంగా స‌త్క‌రించింది. డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించి బెంగ‌ళూరు టైటిల్ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆర్‌సీబీ అభిమానులు 16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించి త‌మ కోరిక‌ను నెర‌వేర్చార‌ని సంబ‌ర ప‌డిపోతున్నారు. ఈ విష‌య‌మై కూడా కోహ్లీ మాట్లాడాడు. "ఆర్‌సీబీ మ‌హిళ‌లు డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ గెల‌వ‌డం నిజంగా అద్భుతం. మేము కూడా ఈసారి ఐపీఎల్‌లో విజ‌యం సాధించి ట్రోఫీల‌ను డ‌బుల్ చేస్తే, అది క‌చ్చితంగా ఎంతో ప్ర‌త్యేకంగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News