9 ఏళ్ల బాలుడిని అచ్చం అయోధ్య బాలరాముడిలా మార్చేసిన దంపతులు!

  • అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందించాలనుకున్న ఆర్టిస్ట్ ఆశిష్‌కుందు
  • అది నెరవేరకపోవడంతో బాలుడినే విగ్రహంలా తీర్చిదిద్దాలని నిర్ణయం
  • దారిలో కనిపించిన ఓ బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించిన వైనం
  • అచ్చుగుద్దినట్టు అయోధ్య బాలరామయ్యలానే అబీర్ దే
అయోధ్య రామయ్యపై ఉన్న భక్తితో ఆర్టిస్టులైన దంపతులు 9 ఏళ్ల బాలుడిని అచ్చం అయోధ్య బాలరాముడి (రామ్ లల్లా)గా మార్చేశారు. పొరపాటున కాదు.. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రామయ్యలానే కనిపిస్తుండడం విశేషం. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన ఆశిష్‌కుందు తన భార్య రూబీ సహకారంతో కుమారుడిని బాల రామయ్యలా మార్చేశాడు. ఇంట్లో తయారుచేసిన, మార్కెట్లో దొరికిన మేకప్ వస్తువులతోనే ఆశిష్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం నెలరోజుల్లోపే ఈ అసాధారణ ఘనత సాధించారు. అసన్‌సోల్‌లోని మోహిసెలా ప్రాంతానికి చెందిన అబీర్ దే అనే బాలుడు వారి చేతిలో బాల రామయ్యగా ఒదిగిపోయాడు. అయోధ్య బాలరామయ్య రూపురేఖలతో అచ్చం అలాగే దర్శనమిచ్చాడు.

ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి రామ్ లల్లాను పోలిన విగ్రహాన్ని రూపొందించాలన్న కోరిక కలిగిందని తెలిపారు. అయితే, ఆయన కోరిక నెరవేరకపోగా, అది మరోలా తీరింది. విగ్రహం కాకుండా ఏకంగా బాలుడినే రాముడిలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచే దానిపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. 

 బాలుడి కుటుంబ సభ్యులను కలిసి
ఆశిష్ ఒకరోజు అనుకోకుండా 9 ఏళ్ల అబీర్‌ బీని చూశాడు.  ఆ వెంటనే అతడికో కొత్త ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అబీర్ బీ కుటుంబాన్ని కలిసి తన కోరికను వాళ్ల ముందు బయటపెట్టాడు. అతడు చెప్పింది విన్న అబీర్ బీ కుటుంబం కూడా అందుకు అంగీకరించింది. 
 
ఆభరణాల రూపకల్పన
పగటిపూట బ్యూటీ పార్లర్ నిర్వహించే ఈ ఆర్టిస్ట్ దంపతులు రాత్రివేళ మాత్రం బాలుడిని రాముడిగా మార్చడంపై వ్యూహాలు సిద్ధం చేశారు. కచ్చితమైన ప్రణాళిక, కృషితో నెలరోజుల్లోనే ఆశిష్-రూబీ దంపతులు లక్ష్యాన్ని చేరుకున్నారు. బాలుడిని రాముడిలా మార్చేందుకు అవసరమైన మేకప్ వస్తువులను సమకూర్చుకోవడంతోపాటు ఆభరణాలను రూపొందించారు. ఆభరణాల బరువుతో బాలుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తేలికైన ఫోమ్‌తో ఆభరణాలు రూపొందించారు. 

నమ్మలేకపోయిన ప్రజలు
అబీర్ బీని బాలరాముడిలా రెడీ చేశాక, అతడిని చూసి జనం తమను తాము నమ్మలేకపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆశిష్-రూబీ దంపతులు ఫేమస్ అయిపోయారు. ఇక బాలుడు అచ్చం అయోధ్య బాలరామయ్యలానే ఉన్నాడని ప్రశంసిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.


More Telugu News